వత్సవాయి యువ గళం న్యూస్ ప్రతినిధి:
వత్సవాయి మండలంలోని భీమవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన APAIMS యాప్ ద్వారా ఎరువుల వినియోగం, బుకింగ్‌లపై రైతులకు విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందిగామ ఆర్‌డీఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ, సాగును బట్టి యూరియా, డీఏపీ కోటాలను ఈ యాప్ ద్వారా కేటాయించడం జరుగుతుందని, దీనివల్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పూర్తిగా చెక్ పెట్టవచ్చని తెలిపారు. రైతులకు నచ్చిన డీలర్ నుండి ఎరువులు కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఇందులో ఉందని, ప్రస్తుతం మార్కెట్లో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నందున రైతులు ముందే ఎక్కువ నిల్వలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సదస్సులో కేవీకే ప్రిన్సిపల్ డాక్టర్ కె. లక్ష్మీకళ మాట్లాడుతూ 'ఖేత్ బచావో అభియాన్', PMDS విధానాలపై అవగాహన కల్పించగా, జగ్గయ్యపేట ADA భవానీ యాప్‌పై రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ వేరుకుళ్లు తెగుళ్ల నివారణకు జీవ నియంత్రణ పద్ధతులు, నానో యూరియా, నానో DAP ల విశిష్టతను వివరించారు. మండల వ్యవసాయ అధికారి G. సత్యనారాయణ భూసారాన్ని పెంచే పిల్లిపెసర, జీలుగ విత్తనాలు అన్ని రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని తెలపగా, తహశీల్దార్ వెంకటేశ్వరరావు కౌలు రైతులందరూ తప్పనిసరిగా కౌలు కార్డులు తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా DRC విజయవాడ ADA P. మోహినిపాం, ఆర్‌ఐ జగన్నాధ్, ఆర్‌ఎస్‌కే సిబ్బంది అరవింద్, శ్వేత, వి.ఆర్.ఓ సత్యనారాయణ స్వామి, సొసైటీ ప్రెసిడెంట్ మౌలాలి, సచివాలయ, గ్రామ వార్డు సిబ్బంది మరియు పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.