యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు: మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ

​వత్సవాయి, జూన్ 10 యువ గళం న్యూస్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' (APAIMS) యాప్ ద్వారానే మండలంలోని ఫెర్టిలైజర్ డీలర్లు, సొసైటీలు యూరియా, డీఏపీ విక్రయాలు జరపాలని మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ ఆదేశించారు. ​బుధవారం వత్సవాయి రైతు సేవా కేంద్రంలో మండల పరిధిలోని ఎరువుల డీలర్లు, సొసైటీ సెక్రటరీలకు ఈ యాప్ పనితీరుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికతను జోడించి ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన విధానం వల్ల ఎరువుల పంపిణీలో పారదర్శకత పెరుగుతుందన్నారు. రైతులు సాగు చేసే పంటల వివరాల ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో, తగిన మోతాదులో ఎరువులు అందుతాయని వివరించారు. డీలర్లు అందరూ తప్పనిసరిగా ఈ యాప్ ద్వారానే క్రయవిక్రయాలు జరపాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఎరువుల వ్యాపారులు, వివిధ విలేజ్ సొసైటీల సెక్రటరీలు పాల్గొన్నారు.